మండూక మహర్షి ప్రోక్తమైనందున దీనిని మాండూక్యోపనిషత్తు
అంటారు. ఇది అథర్వ వేదానికి చెందినది. ఆన్నిటికన్నా చిన్నదైన ఈ ఉపనిషత్తులో 12
మంత్రాలు మాత్రమే ఉన్నాయి. అయినా మొత్తం ఉపనిషత్తుల సారం ఇందులో నిక్షిప్తమై ఉంది.
శంకరాచార్యుడు దీనికి విస్తృత భాష్యం రచించి, తన అద్వైత
సిద్ధాంతానికి ఆధారంగా చేసుకున్నారు. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "అయమాత్మా
బ్రహ్మ" అనేది ఈ ఉపనిషత్తులోనే ఉంది.
శాంతి మంత్రము
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం
పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః| వ్యశేమ
దేవహితం యదాయుః |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాః| స్వస్తి
నః పూషా విశ్వావేదాః |
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః| స్వస్తి
నో బృహస్పతిర్ద ధాతు||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
ఓ దేవతలారా, మా చెవులతో శుభమైనదానినే వినెదము గాక. పూజనీయులారా, మా నేత్రములతో
శుభప్రథమగు దానినే దర్శించెదము గాక. మిమ్ములను స్తుతించుచు మా కొసగబడిన
ఆయుష్కాలమును పూర్ణ ఆరోగ్యముతో,
శక్తితో జీవించెదము గాక. సనాచన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము
నొనగూర్చు గాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయు గాక. ఆపదల నుండి
కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించు గాక. మా లోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును
రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభమును ప్రసాదించు గాక.
1. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం
భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ |
యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోకార ఏవ||
ఈ లోకం ఏవత్తూ ఓంకారమే. ఓంకార వివరణ గమనిద్దాం. గతించినవీ, ఉన్నవీ, రాబోయేవీ అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైనది ఏముందో అది కూడా ఓంకారమే.
2. సర్వం హ్యేతద్ బ్రహ్మ అయమాత్మా సో యమాత్మా చతుష్పాత్
ఇవన్నీ భగవంతుడే. ఆ ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ నాలుగు
పరిమాణాలు గలది.
3. జాగరికస్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః
స్థూలభుగ్ వైశ్వానరః ప్రథమః పాదః||
ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ
వైశ్వానరుడి చైతన్యం బాహ్యముఖంగా ఉన్నది. 7 అవయవాలు, 19
నోళ్ళుగల వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు.
4. స్వప్నః స్థానో న్తః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః
ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయః పాదః||
ఆత్మయొక్క రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన
అంతర్ముఖమైనది. 7 అవ్యవాలు, 19 నోళ్ళుగల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని
అనుభవిస్తాడు.
5. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం
పశ్యతి తత్ సుషుప్తమ్| సుషుప్తస్థాన
ఏకీభూతః ప్రజ్ఞానఘన
ఏవానందమయో హ్యాననందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః ||
కోర్కెలు, కలలు ఏదీలేని గాఢనిద్రాస్థితి ఆత్మయొక్క మూడవ
పరిమాణమవుతుంది. ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవీ
ఉండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన ఇది జాగ్రత్ మరియు స్వప్న
స్థితి చేతనలకు ద్వారంగా ఉంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆంనందాన్ని అనుభవిస్తాడు.
6. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో న్తర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్||
ఇతడే సర్వేశ్వరుడు. ఇతడే సర్వమూ తెలిసినవాడు. ఇతడే అన్ని
ప్రాణుల లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికీ మూల కారణం ఇతడే. ప్రాణుల
ఉత్పత్తికి, వినాశనానికీ కూడా ఇతడే కారణం.
7. నాన్తః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞః నోభయతః ప్రజ్ఞ న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞమ్ నా ప్రజ్ఞమ్|
అదృష్టమ్ అవ్యవహార్యమ్ అగ్రాహ్యమ్ అలక్షణమ్ అచిన్త్యమ్
అవ్యపదేశ్యమ్
ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం
మన్యన్తే స ఆత్మా సి విజ్ఞేయః ||
నాలుగవ పరిమాణం. అది అంతర్ముఖ స్థితి కాదు. బహిర్ముఖ స్థితి
కాదు. రెండూ చేరిన స్థితి కాదు. అది చైతన్యం సమకూరిన స్థితి కాదు. అది కనిపించదు.
చేతలులేని, గ్రహించశక్యం కాని, గుర్తులు
లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దాన్ని ఆత్మ చైతన్యంగా మాత్రమే
తెలుసుకోగలం. అక్కడ ప్రాపంచిక చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది. మంగళకరమైనది.
అద్వైతం. ఇదే నాలుగవ పరిమాణం. ఇదే ఆత్మ. దీన్నే తెలుసుకోవాలి.
8. సో యమాత్మా అధ్యక్షరమ్ ఓంకారో ధిమాత్రం పాదా
మాత్రామాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి||
ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే అదే ఓంకారం. అక్షరాలలో అ; ఉ; మ్ అనే
మూడు అక్షరాలతో ఓం రూపొందింది.
9. జాగరితస్థాలో వైశ్వానరో కారః ప్రథమా మాత్రా ఆప్తేరాదిమత్వాద్ వా
ఆప్నోతి హ వై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద||
ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రదావస్థ పరిమాణమైన
వైశ్వానరునితో పోల్చబడుతుంది. వ్యాపకత్వంచేత, ఆరంభత్వంవల్ల
ఈ రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా ఉపాసన చేసినవారి అన్ని కోర్కెలు ఈడేరుతాయి.
అట్టి ఉపాసకుడు ధన కనక వస్తు వాహనాదులతో అగ్రగణ్యుడౌతాడు.
10. స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రా ఉత్కర్షాదుభయత్వాద్ వా ఉత్కర్షతి
హ వై జ్ఞానసన్తతిం సమానశ్చ భవతి నాస్యాబ్రహ్మవిత్ కులేభవతి
య ఏవం వేద||
ఓంకార మంత్ర రెండవ భాగమైన ఉకారం స్వప్నావస్థను ఆధారంగా
చేసుకున్న తైజసుడు. ఎందుకంటే శ్రేష్ఠత్వంచేత, రెండింటి
సంబంధంచేత రెండూ సమానంగా ఉన్నవి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని
పెంపొందించుకుంటాడు. సుఖ-దుఃఖాలవంటి ద్వంద్వాలలో సమతుల్యంతో వ్యవహరిస్తాడు.
జ్ఞానికానివారు ఎవరూ అతని వంశంలో జన్మించరు.
11. సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్తృతీయా మాత్రా మితేరపీతేర్వా మినోతి
హ వా ఇదం హ వాఇదం సర్వమపీతశ్చ భవతి య ఏవం వేద||
ఓంకార మంత్రం మూడవభాగమైన మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న
ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొలతవేసే స్వభావంచేతా, గ్రహించే
స్వభావంచేతా రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్నీ
కొలతవేసేవాడుగా గ్రహించేవాడుగా అవుతాడు.
12. అమాత్రశ్చతుర్థోవ్యవహార్యః ప్రపంచోపశమః శివో ద్వైత ఏవమోంకార ఆత్మైవ
సంవిశత్యాత్మనా త్మానం య ఏవం వేద య ఏవం వేద||
ఓంకార మంత్రంలో నాలుగవ భాగం, భాగమని
చెప్పలేనిది. నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది. మంగళకరమైనది. అద్వైతం. ఈ
ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందుతాడు.
ఈ
సమస్త జగత్తు ఓంకారమే. భూత భవిష్యద్వర్తమానాలు కూడా ఓంకారమే. ఈ త్రికాలాలకు
అతీతమైనది ఏదైనా ఉంటే అది కూడా ఓంకారమే. ఈ జగత్తుకు, దానికి అతీతమైన పరమ సత్యానికి, అన్నిటికి ఓంకారం శబ్ద రూపమైన ప్రతీక.
ఈ ఓంకారం దేనికైతే ప్రతీకగా ఉన్నదో అదే బ్రహ్మం. ప్రతీ జీవుడిలో ఉన్న ఆత్మయే
బ్రహ్మం.